Tuesday, March 31, 2009

'విదేశ్' - భూత(తా)ల స్వర్గం

సావిత్రి లాంటి మహిళకు సూర్యాకాంతం లాంటి అత్త, గుమ్మడి లాంటి మామ, మోహన్‌బాబు(గృహప్రవేశం లో) లాంటి భర్త వాళ్లు పెట్టే హింస. స్థూలంగా ఇదీ సినిమా, సావిత్రి లాంటి మహిళ పాత్రలో ప్రీతీజింతా(చాంద్)జీవించిడమే సినిమాకు జీవం. పెళ్ళికోసం (పెళ్ళి అయ్యాక కాదు, సంబంధం కుదిరి కట్నం డబ్బు పట్టుకొని కెనడా వెళ్లి పెళ్ళి చేసుకుంటుంది 'చాంద్' ఇది కాస్త విడ్డూరంగా అనిపించినా బహుశా పంజాబులో ఇలాగే ఉంటుందేమో) విదేశాలకు వెల్లి అక్కడ ఊమ్మడి కుటుంబంలో ప్రవేశించిన తరువాత తెలుస్తుంది విదేశ్ భూతల స్వర్గం కాదు ఒక నరక కూపం.
సూర్యాకాంతం లాంటి అత్త, కోడలు మోజులో పడి ఎక్కడ తన కొడుకు చివరి కొడుకుని కెనడా తీసుకరావడం మర్చిపోతాడో అని, కొడుకు హనీమూన్ హోటలుకెల్లి మరీ చెడగొట్టే రకం. గుమ్మడి లాంటి మామ కొత్త కోడలిని భర్త, అత్త పెట్టే హింస అన్యాయమని తెలిసినా వద్దని చెప్పలేని నిస్సహాయుడు. మోహన్‌బాబు లాంటి భర్త(రాకీ) సంపాదన చేత కాకపోయినా బార్యని హింసించడానికి ఏమాత్రం ఆలోచించనివాడు. ఇంకా ఆ కుటుంబంలో ఓ తోటికోడలు, ఓ బావ వారి ఇద్దరు పిల్లలు ఉంటారు. సహజంగానే తోటికోడలు ఇవన్ని చూసిందే కాబట్టి చాంద్ కి ధైర్యం చెబుతుంటుంది, బావ పాత్ర కూడా రాకీ లాంటిదే.

కథ పాతచింతకాయ పచ్చడే బాక్‌డ్రాప్ కొత్తది, మొదటి సగం సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉండి రెండవ సగం సోషియో ఫాంటసీ లా ఉంటుంది అదే ఈ చిత్రానికి లోపం(కాని కథలో లీనమైతే పెద్ద లోపంలా అనిపించదు). సినిమా వంద నిముషాలకే పరిమితమైనప్పటికీ కథ చాలా నెమ్మదిగా నడుస్తుంది, కొత్తగా విదేశాలలో అడుగిడిన అమ్మాయిల బేలతనాన్ని అద్బుతంగా చూపాడు. ఏదేని అత్యవసర సహాయం కావాల్సినపుడు 911 కి ఫోన్ చేయొచ్చని కూడా తెలియనంతా అమాయకత్వం. కనీసం తల్లితో మాట్లాడుదామని ఫోన్ చేసివ్వమంటే రేపు మాపనే భర్తతో పడలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోన్ చేసి తన సోదరుడిని తిరుగు టిక్కెట్ పంపమంటే తనని అక్కడే ఉండమన్నప్పుడు తనని సోపానంలో ఒక మెట్టుగా వాడుకుంటున్నాడని తెలియని అమాయకత్వం. కథ ఇలా సాగుతుంటే అనుకోకుండా ఒకరోజు పెరట్లో ఒక నాగు పాము కనిపిస్తుంది ఆ తరువాత చాంద్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది రెండవ సగం.

కెనడాలో నాగుపాములేంటి అని లాజిక్‌ల కోసం వెతకకుంటే సినిమా బాగుంటుంది. సినిమా మొత్తం చాంద్ చుట్టే తిరుగుతుంది, చాంద్ పాత్రలో ప్రీతిజింతా చాలాబాగా నటించింది, కేవలం తన నటన కోసమైనా ఒకసారి చూడొచ్చు. అన్నింటికంటే విదేశీ కొండలు ఎంత నునుపో చాలా బాగా చూపించారు.

2 comments:

బుజ్జి said...

canadalo pamulundava??

కన్నగాడు said...

కెనడాలో పాములుంటాయి కాని, నాగుపాములుండవు.
చిత్రంలోని ఒక పాత్రకూడా ఆ విషయం ప్రస్తావిస్తుంది.

Google Analytics Alternative