నేను ఈ మధ్య మరొకసారి లేక్ డిస్ట్రిక్ట్ వెళ్లడం జరిగింది. లేక్ డిస్ట్రిక్ట్ అనేది స్కాట్లాండులోని ఒక అందమైన కొండలు లోయలతో మరియు సరస్సులతో కూడిన ప్రదేశం, ఈ ప్రదేశాన్ని స్కాట్లాండుకు చెందినదిగా వ్యవహరిస్తారో నాకు ఒక పట్టాన అర్థంకాదు. మాప్ లలో స్కాట్లాండు సరిహద్దు ఎక్కడో పైనే ఉన్నట్టు ఉంటుంది కాని రహదారులపై మాత్రం స్కాట్లాండుకు స్వాగతమని రాసుంటుంది :(.
ఆవిషయాలు పక్కనెడితే, మా పర్యటనని రెండురోజులకు కేటాయించాం. మొదటిరోజు సాంప్రదాయబద్దంగా కాస్త ఆలస్యంగా మిట్టమధ్యాహ్నం బయల్దేరి గ్రెట్నా గ్రీన్ అనే ప్రదేశంలో ఆగాము, ఆ ప్రదేశం ఇంగ్లాండులో సత్సాంప్రదాయాలు వెలుగొందుతున్నప్పుడు లేచిపోయిన ప్రేమికులు పెళ్లిచేసుకునేవారంట! ఇప్పటికీ ఇక్కడ పెళ్లిలు జరుగుతాయంట(మేము వెళ్లిన రోజు కూడా ఒక పెళ్ళి జరిగింది).
అక్కడి నుండి బయల్దేరి వెళ్లి కార్లయిల్ కోట చూసాము, ఇక్కడ కోట అంత పెద్దది, ఆకర్షణీయమైనదేమీ కాదు కాని ఇక్కడ రెజిమెంటల్ బోర్డర్ ఫోర్సు వారి వస్తుప్రదర్శన చాలా బాగుంది. మొదటి ప్రంపచ యుద్దకాలంనాటి ఆయుధాలనుండి ఇప్పటి రాకెట్ లాంచర్ల వరకు అనేక ఆయుధాలు ప్రదర్శించారు. ఇక్కడ కొన్ని మన భారతీయ సైనికులకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. ఒక పుస్తకంపైన ఒక సర్దార్జీ చిత్రంతో బ్లాక్ కాట్ డివిజన్ అని శీర్షిక ఉంది, అది ఏమిటో అని తెలుసుకోవాలి అని చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక ఆరోజు ట్రావెల్ లాడ్జ్ లో విశ్రాంతి తీసుకొన్నాం. మొద్దటి రోజు రోడ్డుపైనించి చూసినప్పుడు చాలా పర్వత శిఖరాలపై మంచుతొడుగులు కనిపించాయి, కొన్నింటిని కెమెరాలో బంధించాను.
రెండవ రోజు ఉదయం లేక్ డిస్ట్రిక్టులోని పెద్దదైన సరస్సు విండ్స్ మియర్ లో బోట్లో విహారానికి వెళ్లాము, ఇదొక రెండు గంటల విహారం పాపికొండలతో పోలిస్తే పేద్ద అందం కాదు గాని దూరంగా ఉన్న మంచు తొడుగు శిఖరాలు అలరించాయి. ఇక్కడ ఒడ్డుకు చాలా స్వాన్ లను చూసాము. చాలామంది స్వాన్ లను హంసలని అంటారు కాని నాకెందుకో వాటిని హంసలు అని అనాలనిపించదు, బహుశా చిన్నప్పటినించి అందరూ హంసలని దేవతా పక్షులని బ్రెయిన్ వాష్ చేయడం వల్లకాబోలు, ఏదేమైనప్పటికీ ఈ స్వాన్లుకూడా గుణగణాలలో మన హంసలకేమీ తేసిపోవేమో. ప్రతీ స్వానుకి జీవితాంతం ఒకే భాగస్వమితో జీవితాన్ని పంచుకుంటుందట, ఒక పక్షి చనిపోతె రెండోది కూడా గుండె పగిలి కొద్దిరోజుల్లోనే చనిపోతుందిట.
అక్కడి నుండి జెన్నింగ్స్ బ్రూవరీకి(జెన్నింగ్స్ బీరు ఫ్యాక్టరీ) వెళ్లాం. అక్కడ బీరు తయారీ గురించి వివరించారు. ఆ కథ వింటూ ఫోటోలు తీసుకోవటం మరిచిపోయాం. ఈ బ్రూవరీలో మొత్తం ఒక మూడంతస్థుల మేడలో ఉన్నది. ఎంతచిన్నగా ఉందంటే ఆ స్థలం ఐదువండల గజాలకు మించదు. ఆ మేడ పద్దెనిమిదో శతాబ్దానికి చెందినదట, అందులో ఒక దూలం గ్రీకులు వారి నావలలో ఉపయోగించినదట. బ్రూవరీ మొత్తం తిరిగి చూసాక కాంప్లిమెంటరీ డ్రింకులిచ్చారు, బహుశా తొమ్మిది మంది గుంపు వచ్చి అందరూ కోక్ తాగడం అదే మొదటిసారి కావచ్చు వాళ్ల బ్రూవరీ చరిత్రలో :)
అక్కడినుండి అలన్ బీ అనే బీచిలో ఆగి బార్బీక్యుపై కోడి, చేప వండుకొని తిని ఇంటికి బయల్దేరాం. కొత్తగా కొన్న కెమెరా, సముద్రంలో అందమైన సూర్యాస్తమయం దానికెదురుగా పూర్ణచంద్రోదయం ఇక నన్నాపేదెవరు(అందుకే చివర్లో అస్తమయ ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి), చివరాఖరి ఫోటోలో ఏముందబ్బా అనుకోవచ్చు, అది రాత్రి తొమ్మిది గంటలకు కటిక చీకటిలో తీసిన ఫోటో.
అదీ నా లేక్ డిస్ట్రైక్ట్ పర్యటన విశేషాలు.
7 comments:
చాలా విషయాలు చక్కని శైలి లో చెప్పారు అభినందనలు
చాలా సంతోషమండీ నేస్తం గారు
HI,
Lake district is not in scotladn...it is in england. See
http://en.wikipedia.org/wiki/Lake_District
నాకు అదే అర్థంకాదండీ భావకుడన్ గారు, న్యూకాసిల్ నుండి కార్లయిల్ వెళ్లేదారిలో స్కాట్లాండ్ సరిహద్దు ఎందుకొచ్చిందో, అంతేకాదు నా సహోద్యోగులు కూడా కార్లయిల్, కెసిక్, పెన్రిత్ చుట్టుపక్కల ప్రాంతాన్నంతా స్కాట్లాండ్ అన్నట్టుగానే వ్యవహరిస్తుంటారు. ఈ దేశం గురించే అసలు అర్థంకాదు లెండి, ఇంగ్లాండు, వేల్స్, ఉత్తర ఐర్లాండు, స్కాట్లాండు కలిపి యుకె అని ఒక దేశం, కాని ఆటల పోటీలలో మాత్రం స్కాట్లాండు జట్టు వేరే ఉంటుంది, ఇంగ్లాండు జట్టు వేరుగా ఉంటుంది :(
సెట్ థియరీలో యూనియన్లు, ఇంటర్‌సెక్షన్ల ఉదాహరణలిచ్చుకోటానికి వీలుగా ఇంగ్లీషోడు నాలుగైదు దేశాల్ని రక రకాలుగా కట్టలు కట్టేసి యూకే, గ్రేట్ బ్రిటన్, వాడి బొంద లాంటి పేర్లెట్టేసుకున్నాడు :-) ఎందులో ఏదుందో ఏది లేదో గుర్తుంచుకోలేక మన్లాంటోళ్లకి తిప్పలు.
@అబ్రకదబ్ర: మీ కామెంట్ బావుంది :) ...
@అబ్రకదబ్ర గారు,
సెట్ థియరీ బోధనా పద్దతుల్లో పందిరాజముపై మీ గురువుగారు, యుకే పై మీరు పేటెంటు తీసుకుంటే మంచిదీమో
Post a Comment