Saturday, October 10, 2009

సామాజిక న్యాయం పేటేంటు - హిందీ

ప్రతీ బ్లాగుకి ఒక థీం ఉన్నట్టే, ప్రతి ఎన్నికల్లో ఒక థీం ఉంతుంది, గడిచిన ఎన్నికల్లో అది 'సామాజిక న్యాయం'. బహుశా గడిచిన ఓ రెండు దశాబ్దాలలో ఈ సారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, నిజం చెప్పాలంటే మొత్తం ఎన్నికల ప్రహసనంలో అన్నింటికంటే అందరిని విస్మయ పరిచిన అంశం ఫలితాలు. ఏంటీ దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు ఈ సోది ఏందబ్బా అనుకుంటున్నారా, యాభై రూపాయలు పెట్టి(ఇప్పుడు వందైందని మొన్న భరతభూమికెళితే తెలిసింది)/ ఎనిమిది డాలర్లు/ పన్నెండు పౌండ్లు [భరతఖండ/అమెరికా/అతిగొప్ప బ్రిటను పౌరులు వరుసక్రమంలో చదువుకోగలరని మనవి] పెట్టి సినిమా వాడి పైత్యాన్నంతా కిమ్మనకుండా చూసి రాగా లేంది ఫి..ర్రీ..గా(దీన్నే ఫ్రీగా అనికూడా అంటారు) ఇక్కడ కొంచెం సోది చదవొచ్చు కదా.(హమ్మయ్యా అందర్నీ కంట్రోళ్ల పెట్టీనట్లే..... ఇగ మనిష్టం ).
ఇగ కథలకొస్తా, గిదంతా పైన జెప్పినట్టు సామాజిక న్యాయం గురించే. గీ సారి ఎలచ్చన్లల్ల ఒకల్ల కంటే ఒకల్లు, ఒకల్ల మీద బడి ఒకల్లు సామాజిక న్యాయం నేనెత్తిన మాట, మా సొంతమైన మాట అని ఓ తెగ లొల్లి జేశిండ్రు, ఏ మాటకామాట జెపి గూడ ఓ పాలన్నడట. అసలు గీ రాజకీయ నాయకులు నాలుకకు నరం తెగిందని తెలుసు గని మరీ బరి తెగించి సామాజిక న్యాయం పేటెంటే(పేటెంటంటే ఏందీ అంటే గా అమెరికాల ఒక దొర కుర్సీల కూకొని ఉంటడు, ఎవల్లు ఏం జేశిన గా దొర దగ్గరికి "నేనే ముందు జేశిన... నేనే ముందు జేశిన" అనుకుంట లగెత్తుకొని బోయి జేప్పాలె, గా దొర ఒక పుస్తకంల రాసుకొని ఒక పత్రం ఇత్తడన్నమాట గట్ల గా పత్రం ఎవని దగ్గరుంటే గాడే అందరికంటే ముదుగాల జేశినట్టు) నాదని ఒక నాయకుడు జనాలముందే నాటకాలడే, గప్పుడే ఒక పే...ద్ద ప్రెస్సు మీటెట్టేసి ఇరవై ఆరు మైకులు ముందు ఎట్టుకొని కడిగేద్దామనుకున్నా(ఇక్కడొక జి.కే కొచ్చను, ఇరవై ఆరు మైకులు అనే ఎందుకన్నా? చెప్పినోళ్ళకి భద్రకాళీ సిల్క్స్, అశోక టాకీస్ పక్కన, మేన్ రోడ్, హన్మకొండ వారి నుండి ఒక కళ్లు తిరిగే గిఫ్ట్) .
అసలు సామాజిక న్యాయం అని నోటికొచ్చినట్లు అనడం తప్ప ఎవరైన ఏమైన జేశినోల్లున్నరా, అసలు సామాజిక న్యాయం అనేది అమలు జేసుడో లేక చేయనీకి బాగా ప్రయత్నం చేశినోళ్ళు ఇద్దరే ఇద్దరు. గండ్ల ఒకలేమో గాంధీ, అయితే గీ మధ్యనే కొన్ని సైనిమాలల్ల అసలు గాంధీ తాత మన మట్టిమీద నడిశిండంటే నమ్మికైతలేదని అంటాండ్రు కాబట్టి, గాయనను రాముడు, కిట్టుడు టైపున ఒక దేవుని కిండ జమ జేత్తే ఇక మిగిలింది ఒక్కడు. ఎవరని ఓ జుట్టు పీక్కోకు(ఎవలో ఐతే నేనెందుకు రాత్త గింత సేపు), గది నేనే. దాని కథాక్రమంబెట్టిదనిన......

ఒకానొక రోజున (నిన్ననో మొన్ననో అనుకునేరు గిది ఓ...... శానా రోజుల కింద అంటే నేనే నెక్కర్లేసు కొని బడికి పొయేకాలంల) బడిల హిందీ పీరెడ్, గప్పుడైతే హిందీ ఎవల్లు జెప్పిండ్రో సరింగా యాదిలేదు (ఇప్పుడా అప్పుడా అప్పుడెప్పుడో జరంత అటిటూ మన తెలుగోడు పెధాన మంత్రైనప్పుడనుకోరాదు) అయినా మన కథల గా ఆర్టిష్టుకి డవిలాగూలే కాదు అప్పీయరన్సు గూడ లేదు ఇగ పేరెందుకు బై. (ఏడనో ఒదిలిన కథ....) అయితే గా హిందీ జెప్పేటోల్లు రాకపోయేపాలికి మహేందరు సారొచ్చిండు, ఇగ మా మహేందరు సారు గురించి ఒక్క మాటల చెప్పాల్నంటే హోలు స్కూలు మొత్తానికి చండశాసనుడి టైపన్నమాట, ఒక సారి కొట్టటమంటు మొదలు పెడితే కొట్టడానికి వాడిన కర్రలు లెక్కబెట్టనీకి వారం బట్టుద్ది అని మా చౌరస్తాల జెప్పుకునేటోల్లు. రాంగనే మమ్మల్నందరిని బయట చెట్టుకిందకి తీసుక బోయిండు(అసలదేమన్నా రవీంద్రనాదు బడి అనుకునేటోళ్లో లేక దానికి పోటీ అనుకునేటోల్లో గని అప్పుడప్పుడు మా గ్రౌండులున్న ఒకేఒక జామ చెట్టు కింద పాఠాలు జెప్పేటోల్లు). మనకసలే భాషాభిమానం ఎక్కువై హిందీని పక్కన బెట్టేశిన ఇప్పుడు ఈ మహేందరుడు ఏమడుగుతడో అని కిందమీద పడుతుంటే క గుణింతం రాయమన్నాడు, హమ్మయ్య గదైతే మనం లిటిల్ బిట్ మెయిన్ టెయిన్ జేస్తం అని నా పలుకందుకొని తెగ రాశేశిన. అప్పటికే శానా మంది రాశింది సూపెట్టి గుడ్డు పెట్టించుకుంటిరి(సారు గుడ్డు పెట్టుడేందనుకోకుండ్రి, పుస్తకాలల్ల గుడ్ అని రాయరు గది) నేను రాశింది సూపెడ్తి సూశిండు సూశిండు ఇగ రైటు పెడుతడనుకుంటాన గంతలనే తప్పు పెట్టిండు, ఇంగ గా రోజుకి నా పని ఖతమ్ అనుకొని మా మహేంద్రుని శేతులల్ల నాకు సౌర కుటుంబ దర్శనం గ్యారెంటీ అనుకుంటనే ఉన్న కాని ఆరోజు ఏ నక్కను తొక్కిన్నో గని మళ్ళా రాసుక రమ్మన్నడు. పోయి కూసోని సోచాయించిన నాకేమో ఏది తప్పో అర్థం కాకపాయే, మా రాకేషు గాడిని సూపియ్యమంటే వాడేమో సూపుత లేడు, గప్పుడర్థమైందీ చారాణా అంటే ఎంత గొప్పదో ముందు దినం ఆడు నా దగ్గరున్న చాక్లేటు అడిగితే ఇయ్యను పో అంటి ఇగ వాడేం సూపుతడు. ఒక దిక్కేమో సారు ఎమైరా ఎంతసేపు రాత్తవు అని తొందర జేయబట్టే. ఇగ ఏదైతే గదే అయిందని మళ్ళా గవ్వే రాసుకొని బోయిన. ఈ సారికి ముందే రడీగా ఉన్న ఎట్లనయినా కొడతడని. ఇగ గా రోజు మస్తుగ కొట్టిందు తప్పు రాశిన అని, అంతల పీరెడయిపోయిందని పోయిండు, నెనోపక్క ఏడుత్తాంటే మా రాక్షషుగాడు పండ్లికిలిచ్చుకుంట ఉండే. కని నాకైతె తప్పేం రాశిన అని అర్థం గాలే. ఇగ సరే అని మా క్లాసు టాప్ కీర్తి పుస్తకం దీసుకొని జూస్తి అన్ని కరెక్టుగనే రాస్తి నాకైతే తప్పు కనబల్లే.

మా కీర్తిని అడిగితి తప్పేడుంది అనీ, కౌ తప్పు రాశినవ్ అని సూపెట్టింది. సక్కంగ సూశిన క పక్కన గీత పైన రెండు గీతలు సరిగ్గనే రాత్తి, నాకింక మహేందరు గాడిని తిట్టడానికి సంస్కృత పదాల కోసం మా రాజేశ్ గాడ్ని అప్పు అడగడానికి లేత్తాన ఇంతల కీర్తి చెప్పింది, కౌ ని క పక్కన గీత ఆ గీతకి పైన రెండు గీతలు కాని నువ్వు క కి పైన ఓ గీత క పక్కనున్న గీతకొక గీత రాసావు అలా రాయొద్దని చెప్పింది. అప్పుడర్థమైంది నేను రాసిందెలా తప్పో, అలా ఎందుకు రాసానా అని ఒక్కసారి ఫ్లాషు బాకులోకేల్లా. కో వరకు బానే రాసిన నేను కౌ కాడికొచ్చే సరికి జామ చెట్టు బోధి చెట్టు అయ్యిందేమో గని, పాపం పైన పెట్టే రెండు గీతలు ఒక నిలువు గీతకే పెడితే ఇంకో గీత అన్యాయం అయిపోదూ , సామాజిక న్యాయం ఏమైపోయింది, గాంధీ తోనే సామాజిక న్యాయం అంతరించి పోలేదు నేనున్నా, అని పైన పెట్టే రెండు గీతలని రెండు నిలువు గీతలకి సరి సమానంగా పంచా అంతే.



14 comments:

అబ్రకదబ్ర said...

అడగ్గానే ఉప్పిగాడు ప్రత్యక్ష్యం. థాంకులు :-)

నాకు నవ్వు తెప్పించే అతికొద్ది టపాకారుల్లో మీరొకరు.

కన్నగాడు said...

మీ వ్యాఖ్యకు థాంక్స్, టపాలో నేనడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరనుకున్నాను, ప్రయత్నించండి.

అబ్రకదబ్ర said...
This comment has been removed by the author.
అబ్రకదబ్ర said...

చిరంజీవి పార్టీ పెట్టిన రోజా? (just guess work. ఆ రోజేదో గుర్తు లేదు)

అబ్రకదబ్ర said...

ఇప్పుడే గూగులించా. అదే :-)

కన్నగాడు said...

కాకతాళీయంగా అని చదివానే గానీ ఇలా ఉంటుందని ఇప్పుడే తెలిసింది, చిరంజీవి పార్టీ పెట్టిన రోజు కాదు.
కాని ఆ పేరుకి ఈ సంఖ్యకి ఒక సంబంధం ఉంది, ఙాపకాల పొదల్లో వెతకండి.

కన్నగాడు said...

కాకతాళీయంగా అని చదివానే గానీ ఇలా ఉంటుందని ఇప్పుడే తెలిసింది, చిరంజీవి పార్టీ పెట్టిన రోజు కాదు.
కాని ఆ పేరుకి ఈ సంఖ్యకి ఒక సంబంధం ఉంది, ఙాపకాల పొదల్లో వెతకండి. మీకు తప్పక కనిపెడతారని అభిలషిస్తున్నాను.

అబ్రకదబ్ర said...

కాపుల శాతం.

కన్నగాడు said...

అంత మంది కాపులు లేరనుకుంటానండీ,
ఈ సారి క్లూ ఇంకొంచెం వివరంగా ఇస్తాను, చిరంజీవీ అనే పేరుతో తప్ప చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు, దానితో సంబంధం ఉన్న వ్యక్తి చిరంజీవితో ఎనిమిది సినిమాలకు పనిచేసారు.
జవాబు 1600 hrs GMTకి చెబుతాను

కన్నగాడు said...

ఆ ప్రశ్నకు సమాధానం, అభిలాష నవలలో చిరంజీవి అనే పాత్ర తన పగటికలలో ఇరవై అయిదు మైకుల ముందు ఉరి రద్దు చేయబడిందని ప్రకటిస్తాడు. అప్పటి యండమూరి విశ్లేషణ ప్రకారం ప్రెసిడెంటుకి కూడా పదహారు మైకులు మాత్రమే వాడతారు. సో నేను చిరంజీవికన్నా ఒక మైకు ఎక్కువ వాడాలనుకున్నా...:)(భద్రకాళి వారి గిఫ్ట్ నాకే)
ఈ సమాధానానికి క్లూలు సరిపోయేవిధంగానే ఇచ్చాననుకుంటా.

అబ్రకదబ్ర said...

డాన్ బ్రౌన్ నవలల్లో విలన్లలా డెడ్ లైన్లు పెట్టి మరీ పజిల్సిస్తే ఎలా? నేనేమన్నా రాబర్ట్ లాంగ్‌డన్నా? :-) (ఎన్టీయార్ తెదేపా పెట్టిన ఇరవయ్యారేళ్లకి చిరంజీవి పార్టీ పెట్టాడు. అదీ ఒక ఆన్సరనుకున్నా కానీ, మరీ సిల్లీగా ఉంటుందనిపించి రాయలేదు)

మొత్తానికి, నేను కనుక్కోలేకపోయేవాడ్ని. ఎనిమిది సినిమాలంటే ఎవరెవర్నో అనుకున్నా కానీ యండమూరి అనుకోలేదు. ఒకవేళ అనుకున్నా - అభిలాషలో మైకుల నంబరే కాదు, అసలు ఆ సీన్ కూడా గుర్తు లేదు. ఇరవయ్యేళ్ల క్రితం చదివిన పుస్తకం మరి.

ఈ పజిల్సేమో కానీ, మీరు కాస్త ఖాళీ చేసుకుని తరచూ రాయొచ్చు కదా. మంచి శైలి, తమాషాగా ప్రెజెంట్ చేసే పద్ధతీ ఉన్నాయి. వృధా చేయొద్దు.

నేస్తం said...

చాలానాళ్ళ తరువాత రాసారు..చక్కగా రాస్తారు కదా ..ఎందుకలా మానేసారు.. తరుచూ రాయండి :)

బ్లాగాగ్ని said...

చాలా బాగా వ్రాశారు. మాండలికం ఎక్కడా పట్టుతప్పకుండా హాయిగా సాగింది. కొన్ని ప్రయోగాలు హాయిగా నవ్వించాయి. మీలో మంచి శైలి వుంది దయచేసి క్రమం తప్పకుండా వ్రాయండి.

కన్నగాడు said...

కొన్ని కారణాల వల్ల రాయలేకపోయాను కాని ఇప్పటి నుండి మళ్లీ క్రమం తప్పక రాస్తాగా....

@నేస్తం, బ్లాగాగ్ని: నా శైలి నచ్చినందుకు సంతోషం.
@అబ్రకదబ్ర: బహుశా మీరు ఇరవై సంవత్సరాల క్రితం చదవడం వలన మీకు ఆ విశేషణం అంతగా గుర్తు లేదేమో కాని నేను చదివేటప్పటికి కుప్పలుతెప్పలుగా న్యూస్ చానల్లు వచ్చాయి, రాష్ట్రపతికి కాదు దారిన పోయే దానయ్య ఇంటర్వ్యూకి కూడా పది మైకులు వాడేవారు కాబట్టి ఇదేం పోలిక అనిపించింది.
ఎనీవే బాగా ఆలోచించినట్టున్నారు:)

Google Analytics Alternative