Sunday, November 1, 2009

లండన్ డ్రీమ్స్

ఒక కాకికి సంగీతమంటే ప్రాణం, అందరూ వ్యతిరేకించినా, పట్టుదలతో సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో సంగీతాన్ని ఔపోసన పడుతుంది. తన కలని నిజం చేసుకునే క్రమంలో తన స్నేహితుడైన ఎలాంటి శిక్షణ లేని కోకిలను బృందంలో చేర్చుకుంటుంది. కోకిలకు శిక్షణతో పనేంటి! కాకి సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన ఖ్యాతి కోకిల ఒక్క రాత్రిలో సంపాదించడంతో కాకి అహం దెబ్బ తింటుంది, కోకిలను కూలదోయడంలో కాకి సఫలమైందా అనేదే మిగిలిన కథ.

ఇక సినిమాలోకి వస్తే కాకి అజయ్ దేవ్ గన్ కాగా కోకిల సల్మాన్, వీళ్ళ బ్యాండు పేరు లండన్ డ్రీమ్స్. ఇదే బ్యాండులో అసిన్ ఒక సభ్యురాలు. సంగీత ప్రధానమైన సినిమాలో శంకర్ ఎహసాన్ లాయ్ ల పనితనం కనబడింది. ఈర్ష్యాపూరితమైన పాత్రలో అజయ్ బాగా చేసాడు, దాదాపు సగం సేపు కళ్లద్దాలు పెట్టుకున్నాకూడా తనలోని ఈర్ష్యాభావాన్ని ప్రేక్షకులకు చేరవేసాడు. స్నేహమంటే ప్రాణమిచ్చే అమాయకపు పల్లెటూరి వ్యక్తి పాత్రలో సల్మాన్ కూడా బానే చేసాడు, ఎటొచ్చి అసిన్।కే సరైన ప్రాముఖ్యంలేనిది, కేవలం హీరోల వెనక చేతులూపే పాత్ర. అజయ్।కి బాబాయి పాత్రలో ఓంపురి కొన్ని సన్నివేశాలలో కనిపిస్తాడు.

ఇక లండన్లో నడిపే బ్యాండులో హిందీ పాటలు పాడితే తెల్లవాడు ఏడ్చేటంతగా మైమరచి పోవడమనేది పంటికింద రాయిలా ఉంది. సినిమా దాదాపుగా కథానాయకుల మధ్య సన్నివేశాలే కనబడుతాయి, అజయ్ తన కలను నిజంచేసుకునే తీరు పెద్దగా చూపలేదు బహుశా నిడివి పెంచడం ఇష్టంలేదేమో. కథలైపోయినాయి అనేవారికి ఇది ఇంకో ఆయుధమే, కథకు మూలాన్ని స్వాతికిరణం నుంచి గ్రహించినప్పటికీ కథనం బాగుంది. విశ్వనాథ్ గారి సినిమా లాంటి సినిమాని ఒక కొత్త దర్శకుడు(విపుల్ షా) తీయగలగడం నిజంగా అభినందించవచ్చు. ముఖ్యంగా రెండో సగంలో డ్రామాని ఎక్కడా దారి తప్పనీయ లేదు.

5 comments:

'Padmarpita' said...

Nice review...

KK said...

ఇందులోని టైటిల్ సాంగ్ మధ్యలో వచ్చే లైన్స్ (ఆ జమానే ఆ పెషావర్ హవా) ఎక్కడో విన్నట్లు, ఏదో పాటకి అనుకరణ/కాపీ లాగ అనిపిస్తుంది. ఎవరికైనా తెలుసా?

అబ్రకదబ్ర said...

లకీ ఆలీ 'సుర్' కూడా కొంత 'స్వాతికిరణం' ఛాయల్లోనే ఉంటుంది కదా.

కన్నగాడు said...

@కెకె, నాకైతే తెలీదు.
@అబ్రకదబ్ర, సుర్ కూడా అదే కథాంశంతో నడుస్తుంది, మీరంటే గుర్తొచ్చింది అప్పట్లో చాలా మంది ఇంగ్లీషులో పేరు చూసి 'సర్' అని చదివేవారు.

కార్తీక్ said...

good good manchi review idi...


www.tholiadugu.blogspot.com

Google Analytics Alternative