Thursday, March 3, 2011

Thank you for smoking (2005)

నా పేరు నిక్, నిక్ నేలర్. నన్ను సృష్టించింది క్రిస్టోఫర్ బకల్ ఐతే హాలీఉడ్కి పరిచయం చేసింది మాత్రం జేసన్ రీట్మన్. ఇంతకీ నేనేం చేస్తానంటారా, సచిన్ క్రికెట్టాడుతాడు, ఫెదరర్ టెన్నిస్ ఆడుతాడు, నేను మాటలాడుతాను. అవును నేను మాట్లాడి బతుకుతాను. నేను పొగాకు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు లాబీయిస్ట్ని. పొగాకు ఉత్పత్తులపై ఆంక్షల ప్రభావం లేకుండా చూడడం, వారి తరఫున మాట్లాడడమే నేను చేసే పని. పొగాకు ఉత్పత్తుల తరఫున మాట్లాడుతానన్నంత మాత్రాన నేను పొగ తాగమని ఎవరినీ ప్రోత్సహించను, కాకపోతే ఎవరి నిర్ణయాన్ని వారికే వదిలివేయాలంటాను.

నాలాంటి వాళ్ళే ఓ ఇద్దరు స్నేహితులు ఉన్నారు నాకు, ఒకరేమో మారణాయుధాలకు ప్రతినిధైతే, ఇంకొకరు మద్యపానీయాలకు. మారణాయుధాల వలన సంవత్సరానికి చనిపోయేది ఎంత, కేవలం పదకొండు వేలమంది అంటే రోజుకు ముప్పై మందే. మద్యపానీయాల వల్ల సంవత్సరానికి లక్ష, దాదాపు రోజుకి 270 ఓ మాదిరిగా ఫర్వాలేదు. అదే నేను ప్రతినిధిగా వ్యవహరించే పరిశ్రమల వల్ల రోజుకి 1200 మంది చనిపోతారు. అది వాళ్ళకు నాకు తేడా!

అంత పెద్ద సంస్థ అన్నాక కొంతమంది శత్రువులుండకపోరు, కొంతమందిలో ఒకడే సెనెటర్ ఓర్టోలాన్ ఫినిస్టర్. ఇతను ఎప్పుడెప్పుడు పొగాకు పరిశ్రమలను మూయించేద్దామా అని గోతి కాడ నక్కలా వేచి చూస్తుంటాడు. వేచి చూసే సమయంలో ఈయన గారికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది అదే 'సిగరెట్ డబ్బాల మీద పుర్రె గుర్తు' వేయాలని.

అందరిలాగే నాకూ ఓ బాసున్నాడు, అందరి బాసుల్లాగే అతనికి టెన్షన్ వచ్చినప్పుడల్లా బుర్ర ఊఅయోగించకుండా చిర్రుబుర్రులాడటం అలవాటే. సెనెటర్ ఐడియా వినగానే బిపి కింగ్ సైజు సిగరెట్లా పెరిగింది.

నాకో కొడుకు జాయ్, వాడు వారాంతాల్లో మాత్రమే నా దగ్గర ఉంటాడు, మిగతా రోజులు తన తల్లితో ఉంటాడు. జాయ్ నా అంతటి వాడవుతాడని నాకు గట్టి నమ్మకం. వాడికెప్పుడు ఒకటి చెబుతుంటా, వాదనలో అవతలి వాడిది తప్పని నిరూపిస్తే చాలు నీది రైట్ అవుతుంది!

ఇలాంటి పరిస్థితుల్లో ఒక విలేకరి హీథర్ హాల్లోవేతో పరిచయమయ్యింది. అ తర్వాత సిగరెట్ డబ్బాల మీద పుర్రె గుర్తు వేసారా లేదా, నా జీవతంలో ఏర్పడ్డ మార్పులే మిగతా కథ.

Movie: Thank you for smoking (2005)
Cast: Aaron Eckhart, Katie Holmes, Maria Bello, Cameron Bright, Adam Brody, J.K.Simmons etc.
Screenplay & Direction: Jason Reitman.
Novel by: Christopher Buckle.
Genres: Comedy, Drama, Political satire.

P.S.క్రిస్టోఫర్ బకల్ నవలని అద్భుతుమైన స్రీన్ప్లేగా మలచాడు దర్శకుడు. జేసన్కి ఇది మొదటి సినిమా, ఇతని తరువాతి చిత్రాలు జునో, అప్ ఇన్ ది ఎయిర్. ఆద్యంతం హాస్యంతో మరియు పదునైన సంభాషణలతో అసక్తికరంగా సాగిపోతుంది. పేరుకి మాత్రం స్మోకింగ్ అని ఉన్నా చిత్రం మొత్తం మీద ఎక్కడా ఏ పాత్ర కూడా సిగరెట్ తాగదు (ఒక్క పాత్ర కొద్ది సేపు పైప్ తాగుతుంది).

0 comments:

Google Analytics Alternative